బాబు సొంత జిల్లాలో ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో సైకిల్ స‌వారీ ఎప్పుడు?

-

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులో రెండు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాలు ఆ పార్టీకి ఇక ద‌క్క‌వ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. దాదాపు ద‌శాబ్దానికిపైగా ఒక నియోజ‌క‌వ‌ర్గంలోను, దాదాపు రెండు ద‌శాబ్దాల‌కు పైగా మ‌రో నియోజ‌క‌వ‌ర్గంలోనూ టీడీపీ ఊసు ఎక్క‌డా వినిపించ‌డం లేదు. దీనిపై అధికారంలోఉన్న స‌మ‌యంలోనూ, ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కూడా చంద్ర‌బాబు పెద్ద‌గా దృష్టి పెట్ట‌లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రోపక్క‌, ఈ రెండు నియోజ‌క‌వర్గాల్లోనూ వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న వైసీపీ.. మ‌రింత దూకుడు పెంచుతోంది. ఫ‌లితంగా ఇక‌, క‌నుచూపు మేర‌లో టీడీపీ ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పాగా వేసే అవ‌కాశం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిస్థితిని చూద్దాం.. ప‌దండి.

 

చంద్ర‌గిరి

నిజానికి ఇది టీడీపీ అధినేత చంద్ర‌బాబు పుట్టిన ప్రాంతం. గ‌తంలో ఆయ‌న కాంగ్రెస్‌లో ఉన్న స‌మ‌యంలో 1978లో విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత టీడీపీ త‌ర‌ఫున ఇక్క‌డ 1985లో అయ్య‌దేవ నాయుడు విజ‌యం సాధించారు. ఇక‌, 1994 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు సోద‌రుడు రామ్మూర్తి నాయుడు గెలుపు గుర్రం ఎక్కారు. ఆ త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు అంటే.. రెండు ద‌శాబ్దాలుగా ఇక్క‌డ టీడీపీ జెండా ఎగిరిందే లేదు. టీడీపీ నాయ‌కుడు గెలిచింది కూడా లేదు. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున గెలిచిన చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి గ‌త ఏడాది ఎన్నిక‌ల్లోనూ విజ‌యం సాధించారు. ఆయ‌న దూకుడు ముందు టీడీపీ నేత‌లు క‌కావిక‌లం అవుతున్నారు.

ప్ర‌తి ఒక్క‌రికీ నేనున్నానంటూ.. ఆయ‌న ముందువ‌రుస‌లో నిలుస్తున్నారు. హంగు, ఆర్భాటాల‌కుదూరంగా ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొని పోతున్నారు. ఇక‌, నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డ టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న మాజీ మంత్రి గ‌ల్లా అరుణ త‌ప్పుకోవ‌డంతో ఇప్పుడు అసలు ఇక్క‌డ పార్టీని ప‌ట్టించుకునేవారు కూడా క‌నిపించ‌డం లేదు. ఈ ప‌రిణామాల‌ను లెక్కిస్తున్న విశ్లేష‌కులు.. స‌మీప భ‌విష్య‌త్తులో కూడా చెవిరెడ్డిని ఎదుర్కొనే నాయ‌కుడు ఇక్క‌డ లేర‌నే అంటున్నారు.

పూత‌ల‌ప‌ట్టు

చిత్తూరు జిల్లాలోని కీల‌క‌మైన ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం పూత‌ల‌ప‌ట్టు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో 2008లో ఏర్ప‌డిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 2009 నుంచి ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. అయితే, అప్ప‌టి నుంచి కూడా ఇక్క‌డ టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది లేదు. 2009 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా ఎల్‌. ల‌లిత కుమారి అనే మ‌హిళ‌కే చంద్ర‌బాబు అవ‌కాశం ఇస్తున్నారు. గ‌త ఐదేళ్ల కాలంలో తాను అధికారంలో ఉండ‌గా నిధులు కూడా మంజూరు చేశారు. వాస్త‌వానికి ల‌లిత కుమారి కూడా క‌ష్టించే వ్య‌క్తిగా పేరు తెచ్చుకున్నారు. అయితే, ఆమెకు ఛాన్స్ ద‌క్క‌డం లేదు. దీంతో 2009లో కాంగ్రెస్ అభ్య‌ర్థి డాక్ట‌ర్ ర‌వి ఇక్క‌డ నుంచి 951 ఓట్ల‌తో విజ‌యం సాధించారు. ఇక‌, 2014లో అయినా త‌న కాలం క‌లిసి వ‌స్తుంద‌నుకున్న ల‌లిత‌కు మ‌రోసారి వైసీపీ నుంచి ప‌రాజ‌యం ఎదురైంది.

ఇక్క‌డ నుంచి మ‌ళ్లీ డాక్ట‌ర్ ఎం.సునీల్ కుమార్ పోటీ చేయ‌డంతో మ‌ళ్లీ ఆమె 902 ఓట్ల తేడాతో ప‌రాజ‌యం పాల‌య్యారు. ఇక‌, గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా తాను గెలిచి తీరుతాన‌ని ఆమె ప్ర‌గాఢంగా విశ్వ‌సించారు. దీనికి రెండు కార‌ణాలు ఉన్నాయి. ఒక‌టి.. గ‌త ఐదేళ్ల చంద్ర‌బాబు కాలంలో తాను ఓడినా.. నిధులు తెచ్చి నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేశారు. ఈ ప‌రిణామం క‌లిసి వ‌స్తుంద‌నుకున్నారు. రెండు.. రెండు సార్లు తాను ఓడాను కాబ‌ట్టి త‌న‌పై సెంటిమెంటు గాలులు వీస్తాయ‌ని భావించారు.

పోనీ.. ఈరెండు కాక‌పోయినా.. వైసీపీ ఓ చ‌దువు లేని వ్య‌క్తికి, కొత్త‌గా అప్పుడే కండువా క‌ప్పుకొన్న వ్య‌క్తికి టికెట్ ఇచ్చింది కాబ‌ట్టి.. ప్ర‌జ‌లు త‌న‌వైపే మొగ్గు చూపుతార‌ని ల‌లిత కుమారి భావించారు. కానీ, ఆమె ప‌రాజ‌యం చ‌విచూశారు. ఈసారి ఏ తొమ్మిదివంద‌లో కాకుండా ఏకంగా 29 వేల ఓట్ల పైచిలుకు తేడాతో ఓడిపోయారు. దీంతో ఇప్పుడు ఆమె గ‌డ‌ప దాటి బ‌య‌టకు రావాలంటే హ‌డ‌లి పోతున్నారు. ఆర్ధికంగా కూడా చితికిపోయాన‌ని త‌న వారి వ‌ద్ద చెబుతున్నారు. మొత్తానికి ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనూ టీడీపీ స‌మీప భ‌విష్య‌త్తులో గెలిచే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version