అధికార పీఠాలు మారితే.. ఆలోచనలూ మారతాయి! ఈ విషయాన్ని రుజువు చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. గతంలో తాను సీఎంగా ఉన్న సమయంలో కేంద్రం ఏదైనా విషయంపై ప్రశ్నిస్తే.. ఇంతెత్తున లేచి పడేవారు. మరీ ముఖ్యంగా `అయ్యా చంద్రబాబుగారూ.. గ్రామీణ సడక్ యోజనకు మా మోడీ గారే కదా.. నిధులు ఇస్తున్నారు. మీరు మరీ అంతగా ప్రచారం చేసుకోవడం భావ్యమా?“ అని కేంద్రం ప్రశ్నించినా.. “రాజధాని అమరావతికి భారీ ఎత్తున నిధులు ఇచ్చాం.. వాటికి లెక్కలు చెప్పలేదు ఎందుకు బాబూ“ అని సొంత కుటుంబ సభ్యురాలు.. బీజేపి నేత పురందేశ్వరి ప్రశ్నించినా.. చంద్రబాబు నేల మీద నుంచి నింగిలోకి ఎగిరి పడేవారు.
“ఠాఠ్!! నాదొక ప్రభుత్వం. మీదొక ప్రభుత్వం.. ధిక్కారమున్ సైతువా! నన్నే ప్రశ్నింతువా? అయినా.. మీ మోడీ బాబు ముల్లెలోంచి తెచ్చి ఏపీకి ఇస్తున్నారా? రాష్ట్ర ప్రజలు కడుతున్న పన్నుల్లోంచి కదా.. మాకు వాటా ఇస్తున్నారు.. మమ్మల్నే లెక్కలు అడుగుతారా? మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్రం అమలు చేసిన పథకాలకు ఆయన ఆ పేరు పెట్టుకున్నారా? చెప్పండి“- అంటూ నిప్పులు చెరిగేసేవారు.
ఇక, కేంద్రం రాష్ట్రాలపై పెత్తనం చేస్తోందని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేవారు. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు వెళ్లి మరీ అక్కడి ముఖ్యమంత్రులతో చేతులు కలిపి మోడీ హఠావో నినాదం ఇచ్చారు. కట్ చేస్తే.. అలాంటి చంద్రబాబు గారు.. ఇప్పుడు ఈ విషయంలోనూ యూటర్న్ తీసుకున్నారు. “కేంద్రం కల్పించుకోవాలి.. కేంద్రం జోక్యం చేసుకోవాలి.. “ అనే వ్యాఖ్యల నుంచి “కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలి.. కేంద్రం తక్షణమే ఆయా సంస్థలు నిలిపి ఉండేలా జగన్ ప్రభుత్వాన్ని నిలువరించాలి“ అని డిమాండ్లు చేయిస్తున్నారు.
టీడీపీకి చెందిన ముగ్గులు లోక్‌సభ సభ్యులు .. గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేశినేని శ్రీనివాస్‌లు వరుసగా పార్లమెంటులో మాట్లాడుతూ.. చేసిన వ్యాఖ్యలు ఇవే.. రాజధాని తరలించేస్తున్నారు జోక్యం చేసుకోండి.. అని ఒకరు అంటే.. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయి.. చర్యలు తీసుకోండి అని మరొకరు.. కియా వెళ్లిపోతోంది ఆపేలా చూడండి జగన్‌ను నిలువరించండి.. అని ఇంకొకరు మొత్తంగా.. రాష్ట్రంలో “కేంద్ర“ ప్రభుత్వం ఏర్పాడాలని కోరుకుంటున్న విధంగా వ్యాఖ్యానించారు. మరి ఇలాంటి టర్న్‌లు, యూటర్న్‌లు బాబు అనుభవాన్ని మసకబారేలా చేయవూ!! ఒక్కసారి ఆలోచించండి తమ్ముళ్లూ..!