సాధారణ ఎన్నికలు పూర్తయిన నాలుగు నెలల్లోనే ఏపీలో చాలా జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ దీనస్థితికి చేరిపోయింది. ఈ ఎన్నికల్లో నాలుగు జిల్లాల్లో టిడిపి కనీసం ఖాతా తెరవలేదు అంటే ఆ పార్టీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలా పార్టీ ఘోరంగా పడిపోయిన జిల్లాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప కూడా ఒకటి. ఇంకా చెప్పాలంటే కడప జిల్లాలో టిడిపి గత మూడు ఎన్నికల్లోనూ ఘోరంగా ఓడిపోతుంది. 2009, 2014 ఎన్నికల్లో ఒక్క సీటుతో సరిపెట్టుకున్న టిడిపి… ఈ ఎన్నికల్లో అసలు ఖాతా తెరవలేదు. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టిడిపి తరఫున కుప్పం నుంచి ఆయన ఒక్కరు. మాత్రమే గెలిచారు. అది కూడా చంద్రబాబు మెజార్టీ గతంతో పోలిస్తే చాలా వరకు పడిపోయింది.
ఒకప్పుడు 50 వేల మెజారిటీతో గెలిచి చంద్రబాబు ఈ ఎన్నికల్లో కేవలం 30 వేల మెజారిటీతో మాత్రమే గెలిచారు. చంద్రబాబు సొంత జిల్లాలోనే టిడిపి ఇలా ఉంటే ఇక సీఎం జగన్ సొంత జిల్లా కడప జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అనేది సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇక ఎన్నికల తర్వాత కడప జిల్లాలో టిడిపి నేతలు పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ బిజెపి లో చేరిపోయారు. ఇక అదే జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బిజెపిలోకి వెళ్లారు. వాస్తవంగా చెప్పాలంటే ఆదినారాయణరెడ్డికి చంద్రబాబు చాలానే చేశారు.
పార్టీ ఫిరాయించి వచ్చిన ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. కడప జిల్లా పెత్తనం అప్పజెప్పారు. అయినా ఆయన తనపై ఉన్న కేసులకు భయపడే బిజెపిలోకి జంప్ చేశారు. ఇక ఇప్పుడు మరో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సైతం రేపోమాపో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరవచ్చని ప్రచారం సాగుతోంది. ఆయన కడప జిల్లా రాజకీయాల్లో మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. ఇక వీరశివారెడ్డి ఎన్నికలకు ముందే వైసీపీకి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. రైల్వే కోడూరు, రాజంపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు సైతం వైసీపీలోకి జంప్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
చంద్రబాబు సొంత ఇలాకా లాంటి సీమలో ఇంత ఘోరమైన పరిస్థితి వస్తుదని ఆయనే ఊహించి ఉండరు.ఏదేమైనా రెండు, మూడు నియోజకవర్గాల్లో బలమైన నేతలు పార్టీని వీడడంతో టిడిపి జిల్లాలో పూర్తిగా బలహీన పడి పోయి చివరకు మండల స్థాయి నేతలు మాత్రమే మిగిలే స్థితికి చేరిపోయింది. టీడీపీకి ఎమ్మెల్యేలు లేని జిల్లాలు ఉన్నా… వచ్చే ఎన్నికల నాటికి కడపలో కనీసం పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు అయినా మిగులుతారా ? అన్న అనుమానాలు వస్తున్నాయి.