నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు- అనే రీతిలో టీడీపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారా? అంటే.. తాజాగా మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలు ఔననే అనిపిస్తున్నాయి. రాజకీయంగా విమర్శలు చేయబోమని ఒకప క్క టీడీపీ అధినేత, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు చెబుతున్నా.. తమ్ముళ్లు మాత్రం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తు న్నారు. ఇప్పటి వరకు కరోనా కింద ప్రజలకు ఎంత ఖర్చు పెట్టారు? ఎంత మంది పేదలకు బియ్యం ఇచ్చారు? ఎన్ని కిలోల కందిపప్పు ఇచ్చారు? ఎంత డబ్బు పంచారు? వెంటనే శ్వేతపత్రం విడుదల చేయండి!! -ఇదీ తాజాగా దేవినేని చేసిన డిమాండ్. నిజానికి ఇది వినేందుకు బాగున్నా.. ఇల్లు కాలుతుంటే.. చుట్టకు నిప్పు అడిగిన చందంగా ఉందనే విమర్శలు మాత్రం వచ్చాయి.
ప్రస్తుతం కరోనా కోరలు చాస్తోంది. దీంతో ఎక్కడికక్కడ ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయంలో ప్రభుత్వం ఎవరినీ పస్తులు పెట్టరాదనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది. కేంద్రం సాయం చేసిందా? చేయలేదా? అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండానే ప్రజలకు అవసరమైన విధంగా ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే అందరికన్నాముందుగానే ఈ నెల 1 నుంచే పింఛన్లు ఇచ్చింది. నాలుగోతేదీ నుంచి బియ్యం, నిత్యవసరాలను అందిస్తోంది. అదేసమయంలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తూనే,.. ఉదయం వేళలో కొంత రిలాక్సేషన్ ఇచ్చి.. ప్రజలకు సేవలందిస్తోంది. దీనిని ప్రపంచం మొత్తం మెచ్చుకుంటున్నా.. మన ప్రతిపక్షానికి మాత్రం కనిపించడం లేదు. వినిపించడం లేదు.
ఇక, ఇప్పటికే ఎంతో చేశాం.. అని చేతులు ముడుచుకుని కూర్చోకుండా.. ప్రతి ఒక్కరికీ మూడు మాస్కుల చొప్పున పంపిణీ చేయాలనినిర్ణయించుకుంది. దీనికి అవసరమైన నిధులు 50 కోట్లను కూడా మంజూరు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఇక, 4 వేల కోట్లతో రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసిన తొలి రాష్ట్రం ఏపీనేనని సాక్షాత్తూ కేంద్ర మంత్రి , బీజేపీ నేత కిషన్ రెడ్డి నిన్నటికి నిన్న మీడియాకు చెప్పారు.
అయినా కూడా ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలనే సంకల్పంతో ఇలా దేవినేని ఉమా వ్యాఖ్యలు చేయడం ఈ సమయంలో సమంజసం కాదనేది విజ్ఞుల మాట. అంతేకాదు, ఏదైనా సాయం చేయాల్సిన సమయంలో ఇలా విమర్శలు చేయడం సబబా? అనే ప్రశ్న కూడా వస్తోంది. లెక్కలు, గణాంకాలు అడిగే సందర్భం కూడా ఇది కాదని అంటున్నారు. మరి దేవినేని పంథా మార్చుకుంటారా? చూడాలి!