అమరావతిలో ప్రజల పేరు చెప్పి సొంత ఆస్తులు పోగేసుకున్న టీడీపీ అనకొండలను వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా బయటకు లాగింది. అమరావతి నిజంగా ప్రజారాజధాని అయితే.. టీడీపీ నేతలకు ఇంకా రాజధానిగా ప్రకటించకముందే పదుల సంఖ్యలో ఎకరాలను ఎలా కట్టబెట్టారని ప్రభుత్వం నిగ్గదీసింది. ఎవరు ఎవరికి మేలు చేశారో.. ఎవరు ఎవరి పక్షాన నలబడి సొంత వారికి మేలు చేసుకున్నారో.. లెక్కలు.. పత్రాలతో సహా ప్రభుత్వం నడి రోడ్డుపై టీడీపీ అధినేత చంద్రబాబు బాగోతాన్ని వెల్లడించింది. పైకి ప్రజా సేవ చేస్తున్నట్టుగా కనిపించే తమ్ముళ్లు.. ప్రజారాజధాని పేరుతో ప్రజల భూములను ఎలా ఆబగా భోంచేశారో స్పష్టం చేసింది.
మొత్తంగా రాజధాని ప్రాంతంలో 4 వేల ఎకరాలకు పైగా భూములను టీడీపీ అధినేత సహా ఆపార్టీ కీలక నాయకులు కారు చౌకకు కొనేసి.. రైతుల నెత్తిన కుచ్చుటోపీ పెట్టేసి… వందల కోట్లు పోగేసుకున్నారు. వీరిలో ప్రభుత్వం వెల్లడించిన పేర్లలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన తన కుటుంబ సభ్యుల పేరిట భారీ గా భూములు కొనేశారు. జీవీ కుటుంబ సభ్యులకు ఇక్కడ గ్రామాల్లో మొత్తం 40 ఎకరాలకు పైగా భూములు ఉన్నాయని ప్రభుత్వం అసెంబ్లీలో వెల్లడించింది. అవి కూడా ఏయే ప్రాంతాల్లో ఉన్నాయో పేర్కొంది.
రాజధాని ఏరియాలో ఉన్న వెలగపూడి, మందాడ, ఐనవోలు, హరిశ్చంద్రాపురం, మందడం. వెంకటాయపాలెం గ్రామాల్లో జీవీ కుమార్తె లక్ష్మీసౌజన్యతో పాటు ఆంజనేయులు తండ్రి రామాంజనేయులు పేరిట కూడా భారీ ఎత్తున భూములను కొనేశారు. రాజధాని భూ దోపిడీలో ఒక్క ఆంజనేయులదే పెద్ద ల్యాండ్ బ్యాంక్ అని ప్రభుత్వం పేర్కొంది. ఆయన ఆంజనేయులు కాదు ఆనకొండేయులు అయ్యారని అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్వయంగా చెప్పారు. జీవీకొన్న 40 ఎకరాలు ఎకరం రు.10 కోట్లు వేసుకున్నా మొత్తం రు. 400 కోట్లు పైన ఉంటుందని లెక్కలతో సహా వివరించారు.
కొసమెరుపు ఏంటంటే… తాను ప్రజాపక్షపాతినని, తనకు ఆస్తులపై వ్యామోహం లేదని, కుడిచేత్తో సంపాయించింది ఎడంతో చేత్తో ఇచ్చేస్తానని, అందుకేతాను శివ లీలా ఫౌండేషన్ స్తాపించానని నీతులు చెబుతూ.. మహిళలకు చీరలు, పసుపు పంచుతూ.. ప్రజల ఆస్తిని కోట్లలో దోచేశాడని అంటున్నారు స్థానికులు!! ఎంతైనా ప్రజాసేవకుడు కదా.. ఆ మాత్రం దోచుకుని దాచుకోవాలిగా అని నోళ్లు నొక్కుకుంటున్నారు.