భూమా ఫ్యామిలీలో చిచ్చురేపుతున్న భార్గవరాముడు…!

-

కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో భూమా కుటుంబానికి ప్రత్యేకవర్గం ఉంది. ప్రత్యేకించి ఆళ్లగడ్డ , నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో భూమా కుటుంబం ఒకప్పుడు శాసించింది. అయితే కర్నూలు జిల్లాలో రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న భూమా నాగిరెడ్డి కుటుంబం ఇప్పుడు ఒంటరి అయింది. ఒక్కొక్కరు భూమా కుటుంబానికి దూరం కావడానికి మాత్రం ఒక్కరే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. భూమా అఖిల భర్త భార్గవ రాముడు తీరు ఆ కుటుంబాన్ని ఒంటరి చేస్తోందని భూమా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భూమా నాగిరెడ్డి , ఎస్వీ సుబ్బారెడ్డి, ఎస్వీ నాగిరెడ్డి కుటుంబాలు ఒకప్పుడు కర్నూలుని శాసించాయి. భూమా నాగిరెడ్డి బంధుగణం, అనుచరగణం బలంగా ఉండేది. భూమా నాగిరెడ్డి, శోభ ఏడాది వ్యత్యాసంతో మృతిచెందడంతో భూమా అఖిల రాజకీయ పగ్గాలు చేపట్టింది. శోభా నాగిరెడ్డి పోలింగ్ కంటే ముందు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినా ఎన్నికల్లో ఆమెనే గెలిపించారు ఆళ్లగడ్డ నియోజకవర్గ ఓటర్లు. నాగిరెడ్డి మరణం తరువాత మంత్రి పదవి దక్కించుకున్న భూమా అఖిలప్రియ క్రమంగా బంధువులకు దూరమైంది. అనుచరుల్లో చాలా మంది దూరమైనా కొందరు అయిష్టంగానే కొనసాగుతున్నారట.

భూమా నాగిరెడ్డి మృతి తరువాత ఆయన అత్యంత సన్నిహితుడు ఏవి సుబ్బారెడ్డితో భూమా అఖిలప్రియకు విబేధాలు వచ్చాయి. నంద్యాల ఉప ఎన్నికల్లో వారి మధ్య విబేధాలు బట్టబయలు అయ్యాయి. ఏవి సుబ్బారెడ్డి హత్యకు కుట్ర చేసారంటూ కడప జిల్లాలో కిరాయి హంతకులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ హత్యకు కుట్ర వెనుక భూమా అఖిల, భర్త భార్గవ రాముడు ఉన్నారని కేసు నమోదయింది. భూమా నాగిరెడ్డి సోదరుని కుమారుడు భూమా కిశోర్ రెడ్డి విభేదించి బీజేపీ లో చేరడంతో ఆ కుటుంబంలో చీలిక వచ్చింది. తాజాగా విజయ డైరీ చైర్మన్ పదవి భూమా కుటుంబంలో మరో చీలికకు దారితీసింది.

చైర్మన్ గా భూమా నాగిరెడ్డి చిన్నాన్న భూమా నారాయణ రెడ్డి మూడు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్నారు. చైర్మన్ పదవిని చేజిక్కించుకునేందుకు భూమా నాగిరెడ్డి తనయుడు జగత్ విఖ్యాత రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే భూమా నారాయణరెడ్డి ఇంటికి భార్గవ రాముడు, భూమ విఖ్యాత రెడ్డి వెళ్లడంతో విబేధాలు రెచ్చకెక్కాయి. భూమా అఖిల సోదరుడు భూమా విఖ్యాత రెడ్డి, భర్త భార్గవ రాముడుపై కేసు కూడా నమోదయింది.

భూమా నాగిరెడ్డి దంపతుల మృతి తరువాత ఆ కుటుంబం లోకి వచ్చిన భార్గవరాముడు వ్యవగారిస్తున్న తీరు ఆ కుటుంబాన్ని అందరికి దూరం చేస్తుందనే చర్చ జరుగుతోంది. భూమా అఖిల ప్రియ రాజకీయంగా నష్టపోవడానికి భార్గవ రాముడే కారణమని అఖిల బంధువుల్లో వ్యక్తమవుతోంది. అనుభవం లేని చిన్నపిల్లాడైన భూమా విఖ్యాత రెడ్డి కి విజయ డైరీ చైర్మన్ పదవి ఆశ చూపి మరో వివాదానికి కారణమయ్యారనే అభిప్రాయం ఉంది. భార్గవ రాముడు వేస్తున్న రాజకీయ ఎత్తుగడలు భూమా కుటుంబానికి ఉపయోగపడకపోగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version