అప్పుల ఊబిలో కూరుకుపోయిన పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. 717 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.5,354 కోట్లు) విలువైన బాకీలపై మూడు చైనా బ్యాంకుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చైనా బ్యాంకులు ఇప్పుడు అనిల్ అంబానీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తుల వివరాలను అంచనా వేసేందుకు సిద్ధపడుతున్నాయి. లండన్ కోర్టు ఉత్తర్వుల మేరకు బకాయిల వసూలుకు రంగంలోకి దిగాయి. తమకు రావాల్సిన రుణ బకాయిలకోసం అందుబాటులో ఉన్న చట్టపరమైన అన్నిమార్గాలను ఉపయోగించుకుంటామని ప్రకటించాయి.
అనిల్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) అంబానీ పర్సనల్ గ్యారంటీతో, చైనాకు చెందిన మూడు బ్యాంకుల నుంచి 2012లో 925 మిలియన్ డాలర్ల రుణం తీసుకుంది. కానీ దివాలాతీసిన ఆర్‌కామ్ ఈ రుణాన్ని పూర్తిగా చెల్లించడంలో విఫలమైంది. దీంతో ఈ బకాయిల వసూలు కోసం కోర్టును ఆశ్రయించగా, చైనా బ్యాంకులకు రూ .5,226 కోట్లు చెల్లించాలని మే 22 న కోర్టు అనిల్ అంబానీని ఆదేశించింది. జూన్ 29 నాటికి, అంబానీ చెల్లించాల్సిన అప్పు 717.67 మిలియన్ డాలర్లకు పెరిగింది. అయితే తన దగ్గర చిల్లిగవ్వలేదనీ, బాకీ చెల్లించే స్తోమత లేదని అంబానీ వాదిస్తున్నారు. అయితే అంబానీ వాదనతో విబేధిస్తున్న బ్యాంకులు అప్పులు కట్టాల్సిందేనని స్పష్టం చేశాయి.