అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రత్యేకత.. వివరాలు..

-

అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఫిబ్రవరి 21వ తేదీన జరుపుకుంటారు. మనం నేలమీద పడినప్పటి నుండి మన చుట్టూ కనిపిస్తున్న, వినిపిస్తున్న భాషే మాతృభాష. ఇంట్లో మాట్లాడుకునే భాష మాతృభాష. ప్రస్తుతం మాతృభాషలకి ప్రాధాన్యం తగ్గిపోతుంది. దానికి కారణం ఇంగ్లీషు మీద వ్యామోహం. ఇంగ్లీషు నేర్చుకుంటేనే జీవితం బాగుపడుతుందని చెప్పి, మాతృభాషని పట్టించుకోవడం లేదు. ఐతే నిపుణులు చెబుతున్న ప్రకారం మాతృభాషలో సాగే విద్య జ్ఞానాన్ని ఇస్తుందని, దానివల్లే వారు ప్రపంచాన్ని చదువులో వెతుక్కోగలుగుతారని అంటున్నారు.

చుట్టు పక్కల ఉండే ప్రాంతానికి, వాటి నేపథ్యానికి తగినట్లుగా కాకుండా వేరే విధంగా విద్య సాగడం వల్లే చదువులో నాణ్యత ఉండట్లేదని, ప్రస్తుతం అలాంటి పరిస్థితే ఏర్పడిందని చెబుతున్నారు. అమ్మ భాష మధురమే కాదు, మహోన్నతం కూడా. ఇతర భాషలు నేర్చుకోవద్దని చెప్పడం ఇక్కడ ఉద్దేశ్యం కాదు. మాతృభాషలో మాట్లాడడం చిన్నతనం అనుకోవద్దని చెప్పడమే. చిన్నప్పుడు లోకాన్ని చూపించిన భాష, పెద్దయ్యాక పనికిరాదని అనుకోవడమే మంచిది కాదు. మాతృభాషలో మాట్లాడట్లేదంటే నిన్ను నువ్వు గౌరవించుకోవడం లేదనే అర్థం.

నీ గౌరవాన్ని, నీ బాల్యాన్ని, నీ వారసత్వ సంపదని తాకట్టు పెడుతున్నట్టే లెక్క. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకుని మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, మాతృభాషలని పరిరక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉందని, వాటిని మరిస్తే మన మహోన్నతమైన వారసత్వాన్ని పోగొట్టుకున్న వారం అవుతామని, ఇంగ్లీషు నేర్చుకోవద్దని కాదని, కానీ మాతృభాషలో విద్య అందిస్తే వికాసం మరింత పెరుగుతుందని, చిన్నపిల్లల్లో సృజనాత్మకత పెరిగేందుకు మాతృభాషని మించినది మరోటి లేదని తెలిపారు.

ప్రపంచంలో గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్న వాళ్లందరూ మాతృభాషలోనే చదువుకున్నారని, మాతృభాషలో మాట్లాడితేనే ఇతర భాషలు సులభంగా నేర్చుకోవచ్చని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version