దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సియోల్‌లోని లిథియం బ్యాటరీ తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించడంతో 22 మంది కార్మికులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో తొమ్మిది కార్మికులు తీ వ్రంగా మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీసు దళాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించాయి. ఈ ఘటనలో గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు పోలీసులు చెప్పారు.
ఫ్యాక్టరీ రెండో అంతస్తులో సోమవారం రోజున బ్యాటరీల పని తీరును సిబ్బంది పరీక్షిస్తూ.. ప్యాకింగ్ చేస్తుండగా ఒక్కసారిగా అవి పేలాయి. ఆ సమయంలో అక్కడ మొత్తం 102 మంది కార్మికులు విధుల్లో ఉన్నారని స్థానిక అధికారి వెల్లడించారు. మృతి చెందిన వారిలో 18 మంది చైనా నుంచి పని కోసం వలస వచ్చిన వారేనని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించామని అధికారులు వెల్లడించారు.