తాలిబన్ల మరో తలతిక్క నిర్ణయం… మగ తోడు లేకుండా వెళ్తే అక్కడకు నో ఎంట్రీ

అమెరికా దళాలు ఆప్ఘనిస్తాన్ నుంచి వెళ్లిపోయాక అక్కడ పౌర ప్రభుత్వాన్ని తాలిబన్లు చేజిక్కించుకున్నారు. గతేడాది ఆగస్టులో ఆప్ఘానిస్తాన్ తాలిబన్ల పాలనలోకి వెళ్లింది. అయితే అప్పటి నుంచి మహిళల హక్కులను అణచివేస్తోంది తాలిబన్ ప్రభుత్వం. మగ తోడు లేకుండా బయటకు వెళ్లడానికి కూడా అనుమతి ఇవ్వడం లేదు. ఈ నిర్ణయాన్ని పాటించకపోతే బహిరంగంగా కొరడా శిక్షలు విధిస్తోంది. మహిళలను విద్యకు కూడా దూరం చేసింది. ఇదిలా ఉంటే తాలిబన్ పాలనలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఘోరంగా దిగజారిపోయింది. తిండిలేక జనాలు అలమటిస్తున్నారు. తమ సొంత కూతుళ్లను, బిడ్డలను అమ్మాల్సిన దుస్థితి… ఆహరం కోసం సొంత కిడ్నీలనే అమ్ముకుంటున్నారు అక్కడి జనాలు. 

ఇదిలా ఉంటే మరో తలతిక్క నిర్ణయం తీసుకున్నారు తాలిబన్లు. తాజాగా మగతోడు లేకుంటే విమానాల్లోకి కూడా మహిళలకు నో ఎంట్రీ అంటూ నిర్ణయం తీసుకున్నారు. మగవాళ్లు తోడు లేకుండా విమానాల్లో మహిళలు ప్రయాణించడానికి వీలు లేదని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. దీంతో వందలాది మంది మహిళలు టికెట్లు ఉన్నా కూడా విమానాలు ఎక్కలేకపోయారు. ఇతర దేశాల పౌరసత్వం ఉన్నవారిని కూడా ఇబ్బందులకు గురిచేశారు. అయితే వారంతా ఆందోళన చేయడంతో మహిళలను ఒంటరిగా విమానంలో ప్రయాణించేందుకు అనుమతించారు.