అఫ్గానిస్థాన్‌లో సంభవించిన భారీ భూకంపం ఆ దేశంలో ఘోర విలయం సృష్టించింది. ఈ విపత్తు వల్ల ఆ దేశంలో ఇప్పటి వరకు 2445 మంది దుర్మరణం చెందారు. ఇంకా కొంత మంది శిథిలాల కింద ఉండటంతో.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు అంటున్నారు. హెరాత్‌లో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని చెబుతున్నారు.
ఈ ప్రకృతి విపత్తులో 2445 మంది మరణించగా… వేలాది మంది గాయాలపాలయ్యారని ఆ దేశం ప్రకటించింది. రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రతతో వరుస ప్రకంపనలతో హెరాత్ ప్రావిన్స్ అతలాకుతలమైపోయింది. ఒక్కసారిగా వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేలాది నివాసితులు శిథిలాల కింద చిక్కుకొని ఉన్నారు.
స్వచ్ఛంద సంస్థలతోపాటు, స్థానికులు కూడా సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకూ ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్గనిస్థాన్కు 10 అంబులెన్స్‌లు, వైద్య సామాగ్రి పంపగా.. 10వేల ప్రాథమిక చికిత్స కిట్లను, 5వేల కుటుంబాలకు అవసరమయ్యే సామాగ్రిని, 15వందల జతల బట్టలను, దుప్పట్లను ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్స్ ఫండ్ అందజేసింది. ఈ సమయంలో అన్ని దేశాలు కలిసి అఫ్గాన్‌కు అండగా నిలబడాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుట్టెరస్ పిలుపునిచ్చారు.