ఉస్మానియా యూనివర్సిటీలో నిర్భంధాలు, హెచ్‌సీయూలోని 400 ఎకరాల భూమిని ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. దీంతో పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జి చేసినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే హెచ్‌సీయూ భూముల వేలం ప్రక్రియ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
యూనివర్సిటీ భూములను కార్పొరేట్లకు అప్పజెప్పడానికి యూనివర్సిటీలో ఘోరమైన నిరంకుశ పాలనను కొనసాగిస్తున్నారని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో తాజాగా లేఖ విడుదల అయ్యింది. నేటి పాలకుల విధానాల వలన మునుపెన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఈ లేఖలో మావోయిస్టు పార్టీ పేర్కొంది.రాజ్యాంగం కల్పించిన చట్టబద్ధతను పట్టించుకోకుండా 400 ఎకరాల భూమిని అమ్ముతున్నారని, ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారి గొంతును నొక్కేస్తున్నారని మండిపడింది.