‘నేను ప్రధాని మోదీతో మాట్లాడితే.. భారత్‌లోని మైనార్టీల హక్కుల గురించి ప్రస్తావిస్తాను. వారి హక్కులను పరిరక్షించలేకపోతే.. భారత్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది’ అని ఇటీవల మోదీ అమెరికాలో పర్యటిస్తున్న సమయంలో అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రులు తీవ్రంగా స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తోన్న ప్రజలందరినీ భారత్ ఒక కుటుంబంలా భావిస్తుందని ఒబామా జీ మర్చిపోకూడదంటూ హితవు పలికారు.
అయితే భారత్‌లో మత స్వేచ్ఛపై బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించడంతో అమెరికా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. బరాక్ ఒబామా పట్ల సమున్నత గౌరవం ఉన్నప్పటికీ, ఆయన ఓ ప్రైవేటు వ్యక్తి అని… వైట్‌హౌస్‌తో ఆయనకు సమన్వయం లేదని బైడెన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత్‌లో మైనారిటీల రక్షణ గురించి ఒబామా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సున్నితంగా ఖండించింది.
ప్రధాని మోడీతో ప్రతి అంశాన్ని బైడెన్ ప్రస్తావించారని… ఈ సంభాషణ చాలా గౌరవప్రదంగా, హుందాగా జరిగిందని వైట్‌హౌస్ సీనియర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ తెలిపారు. ఒబామా పట్ల తమకు సమున్నత గౌరవం ఉందనీ.. అయినా ఆయన ప్రైవేటు వ్యక్తని, ఆయనకు వైట్‌హౌస్‌కు మధ్య అసలు సమన్వయం లేదని స్పష్టం చేశారు.