గాజాపై ఇజ్రాయెల్ భీకర యుద్ధం కొనసాగిస్తోంది. అయితే ఇజ్రాయెల్కో ఓవైపు మద్దతిస్తూనే.. మరోవైపు గాజాలో మానవతా సాయం అందించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేసిన వ్యాఖ్యలపై అమెరికా తీవ్రంగా స్పందించింది. ఇప్పుడు నెతన్యాహు వ్యాఖ్యలు.. అమెరికా రియాక్షన్.. ఇరు దేశాల మధ్య దూరం పెంచనున్నాయని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..?
గాజాలో యుద్ధం ముగిసిన తర్వాత తామే అక్కడ భద్రతా బాధ్యతను చేపట్టే అవకాశం ఉందంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తాజాగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అమెరికా స్పందిస్తూ.. గాజాను తిరిగి ఇజ్రాయెల్ ఆక్రమించుకునేందుకు అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది. అలాంటి చర్యలకు జో బైడెన్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు పలకదని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ స్పష్టం చేశారు. యుద్ధం అనంతరం.. గాజా ఎలా ఉండాలని చర్చలతోనే నిర్ణయించాలని తెలిపారు. హమాస్ దాడులు, యుద్ధాలు తలెత్తకుండా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. పాలస్తీనా భూభాగమైన గాజాను ఆక్రమించడం తప్పని ఇప్పటికే ఇజ్రాయెల్‌కు బైడెన్ తెలిపారని జాన్ కిర్బీ గుర్తు చేశారు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య కాస్త దూరం పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.