జనాభా నియంత్రణలో మహిళలతో పాటు విద్య పాత్రను వివరించే క్రమంలో బిహార్ సీఎం నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. మహిళలను అవమానించేలా నితీశ్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ బీజేపీ విమర్శలు కురిపించింది. సీఎం పదవికి నితీశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. బీజేపీతో పాటు సోషల్ మీడియాలోనూ నితీశ్ వ్యాఖ్యలపై నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ రావడంతో ఎట్టకేలకు సీఎం దిగొచ్చి క్షమాపణలు చెప్పారు. జనాభా నియంత్రణ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు నితీశ్ తెలిపారు.
ఇటీవల బిహార్‌లో నిర్వహించిన కులగణనకు సంబంధించిన నివేదికను మంగళవారం బిహార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం నీతీశ్ కుమార్ మాట్లాడారు. చదువుకున్న మహిళలు శృంగారంలో తమ భర్తలను నియంత్రించగలరని అన్నారు. భర్తల చర్యల వల్ల గతంలో జననాలు పెరిగాయని, అయితే చదువుకున్న మహిళకు భర్తను ఎలా నియంత్రించాలో తెలుసని, అందుకే ఇప్పుడు జననాల రేటు తగ్గుతూ వస్తోందని నితీశ్ కుమార్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. నితీశ్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య హుందాతనాన్ని దెబ్బతీశారని విమర్శించింది.