ఇజ్రాయెల్ సెటిలర్లపై అమెరికా ఆంక్షలు విధించింది. పాలస్తీనావాసులపై పెరుగుతున్న హింస నేపథ్యంలో వెస్ట్ బ్యాంక్‌లోని ఇజ్రాయెల్ సెటిలర్లపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్ తెలిపింది. ఈ మేరకు గురువారం రోజున అధ్యక్షుడు జో బైడెన్ ఉత్తర్వులు జారీ చేశారు. మిత్ర దేశమైన ఇజ్రాయెల్‌కు చెందిన పౌరులపై అగ్రరాజ్యం ఇలాంటి చర్యలు తీసుకోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.
తొలిదశలో భాగంగా వెస్ట్‌బ్యాంక్‌లోని నలుగురు ఇజ్రాయెల్ సెటిలర్లు పాలస్తీనావాసులపై హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని, ఆస్తులను ధ్వంసం చేయటంతో పాటు వాటిని లాక్కుంటామని బెదిరించారని అమెరికా ఆరోపించింది. ఈ క్రమంలోనే ఆర్థిక ఆంక్షలతో పాటు వీసా నిషేధం విధించింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత సామాన్య పౌరులపై జరిగిన దాడుల్లో పాల్గొన్న ఇతరులపై కూడా చర్యలు తీసుకోవాలా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నామని బైడెన్ తెలిపారు.
హమాస్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇజ్రాయెల్ సైన్యం వెస్ట్ బ్యాంక్‌లోనూ దాడులు ప్రారంభించగా అక్కడి సెటిలర్లు పాలస్తీనా పౌరులపై దాడులకు దిగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.