శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై ఖలిస్థాన్ మద్దతుదారులు దాడి చేయడాన్ని అమెరికా చట్ట సభ సభ్యులు ఖండించారు. ఈ నేరానికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అమెరికాలో భారత్ రాయబారి తరణ్‌జీత్ సింగ్ సంధూను బెదిరింపులతో దూషించడాన్ని కూడా వారు తప్పుపట్టారు. ఎవరినైనా దూషించడానికి, ఆస్తులకు నష్టం కలిగించడానికి వాక్‌స్వేచ్ఛ అనుమతించదని పేర్కొన్నారు.
‘‘మేము అమెరికన్ల వాక్‌స్వేచ్ఛ, భావవ్యక్తీకరణకు మద్దతు ఇస్తాం. కానీ, అది హింస, ఆస్తుల విధ్వంసాన్ని అనుమతించదు. దౌత్య కార్యాలయాలపై దాడులు నేరం. వీటిని ఏమాత్రం సహించం. భారత కాన్సులేట్‌పై జరిగిన దాడికి సంబంధించి స్టేట్ డిపార్ట్‌మెంట్, లాఎన్‌ఫోర్స్‌మెంట్‌తో కలిసి విచారణ జరపాలి. దీంతోపాటు దోషులను చట్టం ముందు నిలబెట్టాలి’’ అని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రోఖన్నా, కాంగ్రెషనల్ కాకస్ (భారత్) సహఛైర్మన్ మైఖెల్ వాల్ట్జ్ ఓ సంయుక్త ప్రకటనలో ఖలిస్థానీల దుశ్చర్యను ఖండించారు. ‘‘దేశవాసులు మొత్తం మిత్రులైన భారతీయులకు, దేశభక్తులైన ఇండో-అమెరికన్లకు మద్దతుగా నిలుస్తారు’’ అని మరో కాంగ్రెస్ సభ్యుడు మెక్‌కోర్మిక్ ట్విటర్‌లో పేర్కొన్నారు.