అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి మరో ఆఫ్రో-అమెరికన్ బలయ్యాడు. ఫ్రాంక్ టైసన్ (53) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించి ఒహాయో పోలీసుల బాడీకామ్ దృశ్యాలు వెలుగులోకి రావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అసలేం జరిగిందంటే..?
ఏప్రిల్ 18వ తేదీన కారులో వెళుతున్న టైసన్ తూర్పు కాంటన్‌లో ఓ యుటిలిటీ స్తంభాన్ని ఢీ కొట్టగా.. అనంతరం బార్‌లోకి పారిపోయినట్లు గస్తీ అధికారులు గుర్తించారు. ఫ్రాంక్‌ను అదుపులోకి తీసుకొనే క్రమంలో అతడికి, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు అతడిని కిందపడేసి, చేతికి బేడీలు వేసి.. ఒక అధికారి ఫ్రాంక్ మెడపై మోకాలితో అదిమిపట్టిన దృశ్యాలు బాడీకామ్ లో కనిపించాయి. ‘నాకు ఊపిరాడడం లేదు’ అని అతడు మొత్తుకుంటున్నా.. అరవొద్దు అంటూ బెదిరించాడు. కొద్దిసేపటికి టైసన్‌లో ఎలాంటి చలనం లేనట్లు వారికి అర్థమైంది. దాంతో పోలీసులు అతడికున్న బేడీలు తీసి, సీపీఆర్ చేశారు. తర్వాత స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ టైసన్ ప్రాణాలు విడిచాడు. గతంలో జార్జి ఫ్లాయిడ్ అనే వ్యక్తి ఇదే తరహాలో ప్రాణాలు కోల్పోయారు.