పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ (71)కు మరో షాక్ తగిలింది. తోషాఖానా అవినీతి కేసులో అరెస్టయి జైల్లో ఉన్న ఆయనపై మరో కేసు నమోదైంది. అమెరికాలోని పాక్ రాయబార కార్యాలయ రహస్య సమాచారాన్ని బహిర్గతం చేశారన్న అభియోగంతో ఆయనపై అధికారిక రహస్యాల చట్టం కింద అదనపు కేసు నమోదైంది. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈ కేసు నమోదు చేసినట్లు మీడియా కథనం వెల్లడించింది.
అభియోగం కోర్టులో రుజువైతే 2 నుంచి 14 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశముంది. కొన్ని కేసుల్లో మరణశిక్ష కూడా విధించవచ్చని కథనం పేర్కొంది. అమెరికాలోని పాక్ ఎంబసీ నుంచి లీకైన సమాచారం ఆధారంగా తన ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు అగ్రరాజ్యం కుట్ర పన్నిందని ఆరోపిస్తూ ఇమ్రాన్ రాజకీయ ర్యాలీలు నిర్వహించిన విషయం తెలిసిందే.
మరోవైపు.. అవినీతి అభియోగాలతో పంజాబ్ ప్రావిన్సులోని అటక్ జైలులో మూడేళ్ల కారాగారశిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్.. దేశం కోసం అవసరమైతే వెయ్యేళ్లు కూడా తాను జైలులో గడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.