అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు చిక్కులో పడ్డారు. అసలే అడ్డూఅదుపూ లేకుండా మాట్లాడే ట్రంప్ ఇటీవల కోర్టు తీర్పు అనంతరం కూడా నోరు పారేసుకున్నారు. దీంతో ట్రంప్‌పై మరోసారి పరువు నష్టం దావా పడింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?
‘ఎల్’ అనే పత్రికలో సలహాల శీర్షిక నిర్వహించే ఇ.జీన్ కెరోల్ అనే రచయిత్రి తనపై ట్రంప్ 1996లో మాన్‌హటన్ ప్రాంతంలోని ఓ డిపార్ట్‌మెంటల్ స్టోరులో లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించిన విషయం తెలిసిందే. ట్రంప్ చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలతో తన ఉద్యోగం ఊడిపోయిందని కూడా ఆమె తెలిపారు. జీన్ కెరోల్‌పై ట్రంప్ లైంగిక దాడికి పాల్పడింది వాస్తవమేనంటూ రెండు వారాల క్రితం 9 మంది సభ్యుల జ్యూరీ నిర్ణయించి, ఆమెకు 50 లక్షల డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
ఈ తీర్పు తరవాత ట్రంప్ సీఎన్‌ఎన్ టీవీ ఛానల్ కార్యక్రమంలో కెరోల్ పరువుకు నష్టం కలిగించేలా మళ్లీ వ్యాఖ్యలు చేశారు. కెరోల్ మాటలు బోగస్ అని విమర్శించారు. దీనిపై కెరోల్ కోటి డాలర్లకు సోమవారం కొత్తగా మరో పరువునష్టం దావా వేశారు.