ప్రేమకు వయసుతో సంబంధం లేదని విన్నాం.. చూశాం కూడా. అలాగే తమ కంటే చిన్న వయసులో ఉన్న వాళ్లను.. పెద్ద వాళ్లను పెళ్లి చేసుకున్న ఘటనలు కూడా చూశాం. కానీ తనకంటే దాదాపు 50 ఏళ్లు చిన్నవయస్కురాలైన అమ్మాయిని పెళ్లాడారు ఓ మేయర్. ఈ సంఘటన దక్షిణ బ్రెజిల్ లో జరిగింది.
దక్షిణ బ్రెజిల్‌లోని అరౌకారియా నగర మేయర్ హిస్సామ్ హుసేన్ దేహైని 65 ఏళ్ల వయసులో పదహారేళ్ల అమ్మాయిని మనువాడారు. పెళ్లి ఇలా కాగానే అలా.. కొత్త అత్తగారికి స్థానిక ప్రభుత్వంలో సాంస్కృతిక, పర్యటకశాఖ కార్యదర్శిగా పదోన్నతి ఇచ్చి పడేశారు. తాజాగా బయటకు వచ్చిన ఈ విషయం దుమారం రేపుతోంది. మేయర్‌పై వచ్చిన అవినీతి, బంధుప్రీతి ఆరోపణలపైన విచారణ సంస్థలు దర్యాప్తు మొదలుపెట్టాయి.
బ్రెజిల్ చట్టాల ప్రకారం 16 ఏళ్లు దాటిన అమ్మాయిలు తల్లిదండ్రుల అనుమతితో ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. దీంతో ఆ అమ్మాయికి 16 ఏళ్లు దాటిన మరుసటిరోజే ఈ వివాహం జరిగింది. అమ్మాయి తల్లికి అంతకుముందే విద్యాశాఖలో ఉద్యోగం ఉంది. కానీ, తక్కువ జీతం.. చిన్న హోదా కావడం వల్ల పెళ్లైన తర్వాత అల్లుడు దేహైని ఆమెకు పదోన్నతి ఇచ్చారు. ఈ విషయాన్ని డిప్యూటీ మేయర్ సీమా బయటపెట్టడంతో కొత్త పెళ్లికొడుకు ఇప్పుడు ఇరుకున పడ్డారు.