కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న పలువురిలో రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్లు పడిపోవడం వంటి దుష్ప్రభావాలు తలెత్తాయని బ్రిటిష్- స్వీడిష్ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా ఇటీవల చేసిన ప్రకటన కలకలం సృష్టించింది. ఇదే వ్యాక్సిన్‌ను భారత్లో ‘కొవిషీల్డ్’ పేరుతో తయారు చేసి విక్రయించడంతో ఈ ప్రకటన కోట్ల మంది భారతీయులను ఆందోళనకు గురి చేస్తోంది. భారతదేశంలో ఎక్కువ మంది ఈ టీకానే తీసుకోవడంతో ఇప్పుడు వారంతా తమకు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా మరో వివరణ ఇచ్చింది.
‘మా కరోనా టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రయోగ పరీక్షల్లో ఆస్ట్రాజెనెకా (కొవిషీల్డ్) వ్యాక్సిన్ సక్సెస్ రేటు మెరుగ్గా వచ్చింది. దానికి సంబంధించిన బలమైన ఆధారాలు మా వద్ద ఉన్నాయి. మా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్న వారికి, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులకు మా ప్రగాఢ సానుభూతి. రోగుల భద్రతకే మేం ఎల్లప్పుడూ తొలి ప్రాధాన్యం ఇస్తాం. ఔషధ నియంత్రణ సంస్థల ఆరోగ్య ప్రమాణాలను మేం తప్పక పాటిస్తాం’ అని ఆస్ట్రాజెనెకా కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.