గాజాలోని రఫా ప్రాంతంపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని.. ఇది తీవ్ర విషాదానికి దారితీసే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలోకి మానవతా సాయాన్ని అనుమతిస్తున్న ఇజ్రాయెల్.. రఫాపై దాడిని దానితో సమర్థించుకోవద్దని సూచించింది. కాల్పుల విరమణపై ఒప్పందంతో సంబంధం లేకుండా రఫాపై దండయాత్ర ఖాయమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించిన నేపథ్యంలో ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ యుద్ధాన్ని ఆపేందుకు ప్రపంచ దేశాలు కృషి చేయాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ కోరారు. ఇజ్రాయెల్‌ను ప్రభావితం చేయగల దేశాలు ఈ విషయంలో చేయగలిగిందంతా చేయాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు 12 లక్షల మంది పాలస్తీనియన్లు రఫాలో తలదాచుకున్నారని తెలిపారు. రఫాపై భూతల దాడులకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో సంయమనం పాటించాలని ఇజ్రాయెల్‌కు ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయని ఐరాస మానవతా సాయ విభాగం చీఫ్ మార్టిన్ గ్రిఫిత్ పేర్కొన్నారు. ఆ ప్రాంతంపై ఆపరేషన్ మాటల్లో చెప్పలేని విషాదాన్ని మిగిలిస్తుందని వాపోయారు.