చైనాలో ఏం జరుగుతోంది. నెలరోజులుగా మరో మంత్రి మిస్సింగ్

-

చైనాలో తరచూ మంత్రుల ఆచూకీ గల్లంతు కలకలం రేపుతోంది. ఇటీవల విదేశాంగ మంత్రి కొన్ని నెలలు గల్లంతవ్వడం.. ఆ తర్వాత అతడి స్థానంలో జిన్​పింగ్ సర్కార్ వేరే వ్యక్తిని నియమించిన విషయం తెలిసిందే. తాజాగా మరో మంత్రి మిస్సింగ్ అవ్వడం అలజడి సృష్టిస్తోంది. అసలు చైనాలో ఏం జరుగుతోందని ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది.

దాదాపు నెలరోజుల నుంచి చైనా రక్షణ మంత్రి లీ షాంగ్ఫు ఆచూకీ కనిపించడం లేదు. దీనిపై తాజాగా ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. రక్షణ మంత్రి లీ అదృశ్యానికి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని ఆ దేశ రక్షణ శాఖ అధికార ప్రతినిధి హు కియాన్‌ తెలిపారు. రక్షణ మంత్రి లీ షాంగ్ఫుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరుగుతోందా, ఆయనే రక్షణ మంత్రిగా ఉన్నారా అని విదేశీ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆయన కనిపించకుండా పోవటానికి కారణాలు తనకు తెలియదని.. హు కియాన్ తెలిపారు.

మార్చిలో కొత్తగా ఏర్పడిన చైనా కేబినెట్‌లో లీ షాంగ్ఫు రక్షణ శాఖ పగ్గాలు చేపట్టారు. ఆగస్టులో ఆఫ్రికా-చైనా సదస్సులో పాల్గొన్నారు. ఇక అప్పటి నుంచి ఆయన ఆచూకీ కనిపించడం లేదు. జులైలో తొలగించిన విదేశాంగ శాఖ మాజీ మంత్రి కిన్‌ గాంగ్‌ తర్వాత.. ఈ ఏడాది కనిపించకుండా పోయిన రెండో సీనియర్ మంత్రి లీ షాంగ్ఫు. విదేశాంగ శాఖ మంత్రి కిన్‌గాంగ్‌ను ఎందుకు తప్పించారని కానీ, ఆయనతోపాటు లీ ఆకస్మాత్తుగా ఎందుకు కనిపించకుండాపోయారనే విషయంపై చైనా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version