కాంగోలో పెను విషాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో పదుల సంఖ్యలో మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు అంటున్నారు. భారీ వర్షాల ధాటికి ఒక్కసారిగా విరిగిపడ్డ కొండచరియలు.. కొండ కింది ప్రాంతాల్లో ఉన్న నివాస గృహాలను కప్పేసాయి. దీంతో పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి.
సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. వాయువ్య మంగల ప్రావిన్స్‌లోని లిసాల్ పట్టణంలో.. కాంగో నది తీరప్రాంత పరిసరాల్లో జరిగిన ఈ ఘటనలో ఇప్పటి వరకు 17 మంది దుర్మరణం చెందినట్లు తెలిపారు.
ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టినట్లు మంగల గవర్నర్ సీజర్ లింబయా తెలిపారు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారని.. కానీ ఎంత మంది ప్రాణాలతో ఉన్నారన్న విషయం తెలియదని అన్నారు. వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన లింబయా.. మంగల ప్రావిన్స్ అంతటా మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించారు.