పశ్చిమ దేశాలు చెడ్డవనే అపోహ నుంచి బయటపడాలని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ఆ దేశాలు తమ సరకులతో ఆసియా-ఆఫ్రికా మార్కెట్లను ముంచెత్తడం లేదని తెలిపారు. అందుకే వారిని నెగిటివ్‌గా చూడాల్సిన అవసరం లేదని చెప్పారు. తాజాగా ఓ మలయాళీ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగని తాను పశ్చిమ దేశాల కోసం వకాల్తా పుచ్చుకోవడం లేదని స్పష్టం చేశారు.
భారత్‌ను పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల నాయకుడిగా చూడటం ఇష్టం లేకనే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ జీ20 సదస్సుకు హాజరు కాలేదా..? అనే ప్రశ్నపై జైశంకర్ స్పందించారు. ఈ దేశాలు గత 20 ఏళ్లగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీరు, కొవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇంధన, ఆహార వస్తువుల ధరల పెంపు సమస్యను అనుభవిస్తున్నాయని.. దీంతో తమను ఇతర దేశాల ఆర్థిక వృద్ధి కోసం వాడుకొంటున్నాయనే ఆగ్రహం వారిలో ఉందని తెలిపారు. దానికి పశ్చిమ దేశాలను బాధ్యులను చేయకూడదని అన్నారు. నేటి గ్లోబలైజేషన్‌లో ఉత్పత్తి కేంద్రీకృతమైందని.. దాని పరిమితులు ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు.