పంతం నెగ్గించుకున్న జెలెన్​స్కీ.. ఒడెసా నుంచి ఆహార ఉత్పత్తులతో కదిలిన ఉక్రెయిన్ నౌక

ఎట్టకేలకు ఉక్రెయిన్ తన పంతాన్ని నెగ్గించుకుంది. రష్యా ఆక్రమించిన నౌకాశ్రయం నుంచి సరకుతో ఓ ఉక్రెయిన్ బయల్దేరింది. ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో కుదిరిన ధాన్య ఒప్పందం నుంచి వైదొలగినప్పటి నుంచి నల్ల సముద్ర తీరంలోని ఉక్రెయిన్‌ నౌకాశ్రయాలపై నిరంతరం దాడులు చేస్తున్న రష్యాకు ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం ఒడెసా నౌకాశ్రయం నుంచి 30 వేల టన్నుల సరకుతో ఓ నౌక బయల్దేరింది. ఇందులో ఆహార ఉత్పత్తులూ ఉన్నాయి.

తమ సహకారం లేకుండా నల్లసముద్రం గుండా రవాణా సాగనీయబోమని రష్యా ఇటీవల హెచ్చరికలు చేస్తూనే ఉంది. ముఖ్యంగా ఒడెసాను లక్ష్యంగా చేసుకుంటూ డ్రోన్లు, క్షిపణులు ప్రయోగిస్తూ వచ్చింది. అయితే ఆ హెచ్చరికలను తాము పట్టించుకోబోమని చెబుతూ వస్తోన్న ఉక్రెయిన్‌.. అంతర్జాతీయ సహకారం లభిస్తే.. తాము ఎగుమతులు చేయడానికి సిద్ధమని ప్రకటించింది. చివరకు తన పంతం నెగ్గించుకుంది. ఒడెసా నౌకాశ్రయం నుంచి నౌక బయల్దేరినట్లు అమెరికా కూడా ధ్రువీకరించింది.