కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విశ్వ రూపం చూపుతుంది. గురు వారం ఒక్క రోజులోనే దాదాపు 25 లక్షల కేసులు వెలుగు చూశాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య అధికారిక లెక్కల ప్రకారం 30 కోట్లు దాటింది. గురు వారం ప్రపంచ వ్యాప్తంగా 24,97,154 కరోనా కేసులు వెలుగు చూశాయి. అంతే కాకుండా 6,834 మంది కరోనా కాటుకు బలైయ్యారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా మహమ్మారి కాటుకు బలైన వారి సంఖ్య 54,89,506 కు చేరింది.
అయితే అత్యధికంగా అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, అర్జెంటీనా తో పాటు భారత్ లో కేసులు నమోదు అవుతున్నాయి. అమెరికా లో గురువారం అత్యధికంగా 7,51,512 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఇందులో 95 శాతం ఓమిక్రాన్ వేరియంట్ సోకిన వారే ఉన్నారని అమెరికా అధికారిక వర్గాలు తెలిపాయి. అలాగే 2,143 మంది మరణించారు. అలాగే ఫ్రాన్స్ లో గురువారం 2,61,481 కేసులు వెలుగు చూశాయి. ఇందులో కరోనా, డెల్టా, ఓమిక్రాన్ తో పాటు కొత్త వెరియంట్ కూడా ఉందని ఫ్రాన్స్ ప్రభుత్వం తెలిపింది. ఇటలీలో గురువారం 2.19 లక్షల కేసులు నమోదు అయ్యాయి.
బ్రిటన్ లో 1,79,756 కేసులు నిర్ధారణ అయ్యాయి. అర్జెంటినాలో కూడా లక్షకు పైగా కేసులు నమోదు అయ్యాయి. 1,09, 608 కేసులు వెలుగు చూశాయి. వీటితో ఇండియాలో ఆరు నెలల తర్వాత కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. గురు వారం ఇండియాలో ఎకంగా 1,17,100 కేసులు నమోదు అయ్యాయి. ఈ ఆరు దేశాల నుంచే దాదాపు 16 లక్షల కేసులు నమోదు అయ్యాయి.