మయన్మార్, థాయ్ లాండ్ దేశాలను భూకంపాలు వణికిస్తున్నాయి. శుక్రవారం రోజున సంభవించిన వరుస భూకంపాలు ఈ దేశాల్లో విలయం సృష్టించాయి. వేలాది భవనాలు పేకమేడల్లా కూలిపోవడంతో ఆ శిథిలాల కింద వేలాది మంది చిక్కుకున్నారు. ఈ ప్రకృతి విలయంలో ఇప్పటి వరకు వెయ్యి మందికిపైగా మరణించినట్లు మయన్మార్ మిలిటరీ అధికారులు వెల్లడించారు. వేల మంది గాయపడినట్లు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.
ఇక ప్రకృతి ప్రకోపానికి గురై మృత్యు విలయం చోటుచేసుకున్న మయన్మార్, థాయ్ లాండ్ దేశాలకు ఈ కష్టసమయంలో తోడుగా నిలిచేందుకు ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుగా ఉండే భారతదేశంలో ఈ విపత్కాలంలో ఈ రెండు దేశాలకు అండగా నిలిచింది. ఆపరేషన్ బ్రహ్మ సాయంతో మయన్మార్ కు సహాయక సామగ్రి పంపిణీ చేసింది. టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, జనరేటర్లు ఆహార ప్యాకెట్లను అందించింది.