ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న వేళ ప్రపంచ దేశాల దృష్టి అంతా వీటిపైనే ఉంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ దాడుల్లో గాజా పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఎక్స్ కార్పొరేషన్‌కు ప్రకటనలు, సబ్ స్క్రిప్షన్లపై వచ్చే ఆదాయం మొత్తాన్ని యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోయిన గాజాకు, ఇజ్రాయెల్ ఆస్పత్రులకు, గాజాలో రెడ్ క్రాస్ సంస్థకు విరాళంగా ఇస్తామని ప్రకటించారు. ఎక్స్‌లోని తన ఖాతాలో పోస్టు చేసి ఈ విషయాన్ని తెలిపారు. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో దయనీయ పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో.. గాజా నగరంలో ఇంటర్నెట్, టెలీ కమ్యూనికేషన్ సేవలు స్తంభించిపోయిన నేపథ్యంలో గత నెలలో ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన స్టార్ లింక్ కంపెనీ ద్వారా గాజాలో గుర్తింపు పొందిన సహాయ సంస్థలకు ఇంటర్‌నెట్ సౌకర్యాన్ని అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.