పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్తత పెరగనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పరస్పరం క్షిపణి దాడులు చేసుకుంటున్న ఇజ్రాయెల్, హెజ్‌బొల్లాలు పూర్తిస్థాయి యుద్ధానికి దిగేందుకు సిద్ధమవుతున్నట్లుగా విస్పష్ట సంకేతాల్నిస్తున్నాయి. ఇప్పటికే హమాస్-ఇజ్రాయెల్ మధ్య పోరాటంతో భారీగా ప్రాణ, ఆస్తినష్టాన్ని చవిచూసిన పశ్చిమాసియాలో.. ఇంకో యుద్ధం మొదలైతే మరింత విధ్వంసం తప్పదన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇజ్రాయెల్‌తో హెజ్‌బొల్లా సై అంటే సై అంటోంది. ఇజ్రాయెల్‌లోని కీలక సైనిక, నౌకా స్థావరాలను హజ్బొల్లా.. డ్రోన్ల ద్వారా చిత్రీకరించి, 9 నిమిషాల వీడియో విడుదల చేయడంతో ఇజ్రాయెల్‌కు పుండుమీద కారం చల్లినట్లయింది. దానికి తోడు హెజ్‌బొల్లా వరుస క్షిపణి, డ్రోన్ల దాడులతో ఇజ్రాయెల్‌లోని ఉత్తర ప్రాంత ప్రజలు చాలాకాలంగా తమ ఇళ్లను వదిలేసి వెళ్లిపోయారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ భద్రతకు ముప్పు తప్పదని భావిస్తున్న ఇజ్రాయెల్- ఇక హెజ్‌బొల్లాతో తాడోపేడో తేల్చుకునే సమయం ఆసన్నమైందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ యుద్ధం ఏ క్షణంలోనైనా మొదలుకావొచ్చునని పాశ్చాత్య వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు.