అమెరికాలో దీపావళి సెలవు.. చట్టసభలో బిల్లు

-

అమెరికాలో దీపావళి పండుగ రోజున సెలవు ప్రకటించేందుకు కసరత్తు జరుగుతోంది. దీపావళిని ఫెడరల్ హాలిడేగా ప్రకటించాలని ప్రతిపాదిస్తూ చట్టసభ్యురాలు గ్రేస్డ్‌ మెంగ్‌ యూఎస్‌ కాంగ్రెస్‌ దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో బిల్లును ప్రవేశపెట్టారు. ‘దీపావళి డే యాక్ట్‌’ పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లును అమెరికా వ్యాప్తంగా పలు కమ్యూనిటీలు స్వాగతించాయి.

‘‘ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి దీపావళి చాలా ముఖ్యమైన రోజు. చీకటిపై వెలుతురు, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండగను నిర్వహించడం విశేషం. న్యూయార్క్‌లోని క్వీన్స్‌ ప్రాంతంలో పలు కమ్యూనిటీలు ఈ పండగను వైభవంగా నిర్వహిస్తాయి. దీపావళిని ఫెడరల్‌ ప్రభుత్వ సెలవు దినంగా అధికారికంగా ప్రకటిస్తే.. కుటుంబాలు కలిసి వేడకలు చేసుకునేందుకు వీలుంటుంది. అంతేగాక, విభిన్న సంస్కృతులకు ప్రభుత్వం ఇచ్చే విలువను చాటుతుంది’’ అని మెంగ్‌ తన బిల్లులో పేర్కొన్నారు.

ఈ బిల్లు కాంగ్రెస్‌లో ఆమోదం పొంది.. అధ్యక్షుడు సంతకం చేసిన తర్వాత అగ్రరాజ్యంలో దీపావళిని సెలవు దినంగా ప్రకటించేందుకు వీలు లభిస్తుంది. అది జరిగితే, అమెరికాలో ఫెడరల్‌ గుర్తింపు పొందిన 12వ సెలవుగా దీపావళి నిలవనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version