రిజ్వరాయర్‌లో పడ్డ ఫోన్‌ కోసం.. 41 లక్షల లీటర్ల నీళ్లను ఖాళీ చేయించిన అధికారి

-

అధికారం ఉంటే.. ఎలాంటి పనులు అయినా చేయొచ్చు అని చాలా మంది అనుకుంటారు.. అలాగే చేస్తారు కూడా.. ఇక్కడ కూడా ఓ ప్రభుత్వ అధికారి.. రిజర్వాయర్‌లో పడ్డ తన ఫోన్ కోసం ఏకంగా 41 లక్షల లీటర్ల నీటిని ఖాళీ చేయించారు. రెండు రోజుల పాటు మూడు భారీ మోటార్లతో నిరంతరాయంగా నడిపించి నీళ్లను ఖాళీ చేయించారు. ఇది కాస్త ఉన్నతాధికారులకు తెలియడంతో.. విషయం వైరల్‌ అయింది. అధికారి సస్పెండ్‌ అయ్యాడు.. చత్తీస్‌ఘడ్‌లో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాజేశ్‌ విశ్వాస్‌ అనే వ్యక్తి కాంకేర్‌ జిల్లాలో ఫుడ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల స్నేహితులతో కలిసి స్థానికంగా ఖేర్‌కట్టా డ్యామ్‌ సందర్శనకు వెళ్లారు. ఈ క్రమంలోనే సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ ఆయన స్మార్ట్‌ఫోన్‌ అక్కడి ఓవర్‌ ఫ్లో ట్యాంక్‌ నీళ్లలో పడిపోయింది. రూ.లక్షకుపైగా ఖరీదైన ఫోన్‌ కావడం, అందులో అధికారిక సమాచారం ఉందని తెలపడంతో.. దాన్ని కనిపెట్టేందుకు తొలుత స్థానిక ఈతగాళ్లను రంగంలోకి దించారు. 15 అడుగుల లోతైన నీళ్లలో వారు ఎంత వెతికినా ఫలితం లేకపోయింది.

దీంతో ఈ విషయంపై జలవనరుల విభాగం అధికారికి మౌఖికంగా సమాచారం ఇచ్చి రెండు భారీ మోటార్లతో నీళ్లను ఖాళీ చేయించారు.. సోమవారం సాయంత్రం నుంచి గురువారం వరకు మూడు రోజుల్లో దాదాపు 41 లక్షల లీటర్ల నీళ్లను బయటకు తోడేశారు.. దీంతో ఈ వ్యవహారంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. స్పందించిన జలవనరుల విభాగం.. ఈ ప్రక్రియను నిలిపేసింది. అయితే, ఆ నీళ్లు నిరుపయోగమని తెలిసిందని, అందుకే కొంత భాగాన్ని ఖాళీ చేయించినట్లు ఆ అధికారి చెప్పడం హైలెట్‌ ఇక్కడ.

ఇంతకీ ఫోన్‌ దొరికిందా..?

చివరకు ఆ ఫోన్‌ను వెలికితీసినా.. అది పని చేయడం లేదట.. ఈ వ్యవహారంపై స్పందించిన మాజీ సీఎం, భాజపా నేత రమణ్ సింగ్.. రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఒకవైపు ప్రజలు నీటి ట్యాంకర్లపై ఆధారపడుతుంటే.. మరోవైపు పెద్దమొత్తంలో నీళ్లను ఇలా తోడేశారని విమర్శించారు. ఈ ఘటనపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని మంత్రి అమర్‌జీత్ భగత్ తెలిపారు. అయితే కొంత మేర నీళ్లను తోడేందుకే అనుమతి ఇచ్చామని, కానీ.. చాలా ఎక్కువే ఖాళీ చేశారని జలవనరుల విభాగం అధికారి చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version