అపార్ట్​మెంట్​లో అగ్నిప్రమాదం.. 10 మంది దుర్మరణం

చైనాలోని షింజియాంగ్​లో ఘోరం ప్రమాదం చోటుచేసుకుంది. ఓ అపార్ట్​మెంట్​లో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మృతి దుర్మరణం చెందారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. గురువారం రాత్రి జరిగిందీ దుర్ఘటన. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించారు. దట్టంగా పొగలు, మంటలు కమ్ముకోవడంతో మంటలార్పేందుకు అధికారులకు మూడు గంటల సమయం పట్టింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు.

అంతకుముందు సోమవారం మధ్య చైనాలోని ఓ కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో భారీ ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. ఇటీవల కాలంలో చైనాలోని కర్మాగారాల్లో జరిగిన అతిపెద్ద ప్రమాదాల్లో దీనిని కూడా ఒకటిగా పరిగణిస్తున్నారు. ప్రభుత్వ రంగ పత్రిక హెనాన్‌ డెయిలీ ప్రకారం ఈ కర్మాగారంలో విద్యుత్తు పరికరాల్లో చోటుచేసుకొన్న లోపాల కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నట్లు ఆ పత్రిక పేర్కొంది. ఈ ప్రమాదంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు.