ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (ట్విటర్) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే యూజర్ ఫ్రెండ్లీగా ఎన్నో ఫీచర్లు అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ సంస్థ తాజాగా మరో అద్భుతమైన ఫీచర్ను అందుబాటులోకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది. ఇకపై పూర్తి నిడివి సినిమాలకు వీలు కల్పించనుంది. ఎక్స్ చందాదారులు సినిమాలు, టీవీ సీరియళ్లను పోస్ట్ చేయొచ్చని, వాటిని మానెటైజ్ చేయటం ద్వారా డబ్బు సంపాదించొచ్చని ఎలాన్ మస్క్ ఇటీవలే ప్రకటించారు.
అయితే దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. పోస్ట్ చేసిన సినిమాలకు ఒకసారి ఫీజు చెల్లించే విధానాన్ని వర్తింపజేయాలని మస్క్కు ఒక యూజర్ సూచించారు. దీంతో ప్రజలు సబ్‌స్క్రయిబ్ చేసుకోకుండానే ఆ సినిమాలను కొనుక్కోవచ్చని, అప్పుడు ఎక్స్ నిజమైన సినిమా వేదిక కాగలదని అన్నారు. ఎక్స్‌కు మెరుగైన వీడియో ప్లేయింగ్ యంత్రాంగం అవసరమని, అది సాకారం కావాలని కోరుకుంటున్నానని మరో యూజర్ ఆకాంక్షించారు. త్వరలో ఏఐ ఆడియెన్సెస్ అనే మరో ఫీచర్‌నూ పరిచయం చేయనున్నామనీ మస్క్ ప్రకటించారు.