హమాస్‌ను సమూలంగా అంతం చేయాలని కంకణం కట్టుకున్న ఇజ్రాయెల్ గాజాపై తీవ్రంగా విరుచుకుపడుతోంది. ముఖ్యంగా కాల్పుల విరమణ తర్వాత గాజాపై దాడులను తీవ్ర తరం చేసింది. బాంబు దాడులను కొనసాగిస్తూనే ఉంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచీ ఇప్పటి వరకు గాజాలో 18,000 మంది మరణించినట్లు ఆ ప్రాంత ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వీరిలో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారని తెలిపారు.
ఇజ్రాయెల్ దాడులతో గాజాలో ఆరోగ్య వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 23 లక్షల జనాభా గల గాజాలో ఉన్న మొత్తం 36 ఆస్పత్రుల్లో 11 మాత్రమే పనిచేస్తున్నాయని వెల్లడించింది. అవి కూడా పాక్షికంగానే సేవలందిస్తున్నాయని వెల్లడించారు. కేవలం 66 రోజుల్లోనే గాజా ఆరోగ్య వ్యవస్థ పతనావస్థకు చేరుకుందని ఆవేదన వ్యక్తం చేసింది.
మరోవైపు యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు చనిపోయిన తమ సైనికుల్లో పదిశాతం మంది ప్రమాదవశాత్తు మరణించారని ఇజ్రాయెల్ రక్షణ దళం వెల్లడించింది. ఇప్పటివరకు మెుత్తం 105 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించగా వారిలో 20 మంది ప్రమాదవశాత్తు మరణించారని తెలిపింది. పొరపాటున సొంత బలగాలే వారిని కాల్చి చంపాయని పేర్కొంది.