రిపబ్లికన్ సదస్సు చివరి రోజున పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. ఈ ప్రసంగంలో ఆయన పలుమార్లు ఉద్వేగానికి గురయ్యారు. దేవుడి ఆశీస్సుల వల్లే ఈరోజు మీ ముందు నిలబడగలిగానంటూ తన మద్దతుదారులను ఉద్దేశించి ఎమోషనల్గా మాట్లాడారు ట్రంప్. ఏ మాత్రం పొరపాటు జరిగినా తాను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదని పేర్కొన్నారు. మరోవైపు అధ్యక్ష అభ్యర్థిగా ఆయన్ని ఎన్నుకున్న పార్టీ నిర్ణయాన్ని ట్రంప్ అధికారికంగా అంగీకరించారు.
అనంతరం మాట్లాడుతూ.. “వచ్చే నాలుగేళ్లు అమెరికా చరిత్రలో నిలిచిపోతాయి. సువర్ణాధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా అమెరికాను తిరిగి గొప్ప దేశంగా తీర్చిదిద్దుతాను. బుల్లెట్ సరిగ్గా నా దగ్గరకు వచ్చిన సమయంలో నేను తల తిప్పాను. వలసదారులకు సంబంధించిన సమాచారం చూడడం కోసం చార్ట్ వైపు చూశాను. అలా జరగకపోయి ఉంటే దుండగుడు కాల్చిన బుల్లెట్ లక్ష్యాన్ని చేరుకునేది. నేను ఇలా అందరి ముందు నిలబడి ఉండేవాడిని కాదు. దేవుడి ఆశీస్సులే తనని కాపాడాయి. ఆ క్షణంలో స్వయంగా భగవంతుడే నా చావును అడ్డుకున్నాడు” అంటూ ట్రంప్ ఎమోషనల్ అయ్యారు.