హమాస్, ఇజ్రాయెల్‌ల మధ్య తొమ్మిది నెలలుగా జరుగుతున్న యుద్ధం ముగిసేలా సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా అమెరికా ప్రతిపాదించిన విడతల వారి కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ అంగీకరించింది. అమెరికా ప్రతిపాదన ప్రకారం, తొలుత 6 వారాలపాటు పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ అమల్లో ఉంటుంది. ఈ సమయంలో కొందరు ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేయాల్సి ఉంటుంది. అందుకు బదులుగా పాలస్తీనాకు చెందిన వందలాది మంది ఖైదీలను ఇజ్రాయెల్ వదలుతుంది.
42 రోజుల వ్యవధిలో గాజాలోని జనసమర్థ ప్రాంతాల నుంచి, ఇజ్రాయెల్ సైనికులు వైదొలిగి ప్రజలు తిరిగి తమ స్వస్థలాలకు వచ్చేందుకు సహకరిస్తారు. రెండో విడతలో హమాస్ వద్ద ఉన్న పురుష బందీలను విడుదల చేస్తే.. ఇజ్రాయెల్ మరింత మంది ఖైదీలను విడుదల చేస్తుంది. మూడో విడతలో ఇజ్రాయెల్కు చెందిన మిగతా బందీలను హమాస్ విడుదల చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బందీల్లో ఎవరైనా చనిపోతే, వారి మృతదేహాలను అప్పగించాలి. అమెరికా ప్రతిపాదించిన ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన హమాస్, కచ్చితంగా దీనికి లిఖితపూర్వక హామీ కావాలని స్పష్టం చేసింది.