ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర పోరు ఇంకా కొనసాగుతోంది. ఇజ్రాయెల్‌పై హమాస్ అత్యంత క్రూరంగా దాడులు చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా హమాస్‌ను అంతం చేయాలని ప్రతిన పూనిన ఇజ్రాయెల్ గాజాపై దాడులకు తెగబడుతోంది. ఈ దాడుల్లో పిల్లలు సహా మహిళలు, వృద్ధులు, పౌరులు భారీ సంఖ్యలో ప్రాణాలొదులుతున్నారు.
అయితే ఇజ్రాయెల్‌లో దాడులు జరిగిన ప్రాంతం విశాలంగా ఉండటంతో, కేవలం ఘర్షణలు మాత్రమే జరిగాయని తాజాగా బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హమాస్ ప్రతినిధి ఘాజా హమాద్ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. మహిళలు, పిల్లలు, నిద్రపోతున్న వారిపై జరిపిన దాడులను ఏ విధంగా సమర్థించుకుంటారు? అని యాంకర్ ప్రశ్నించగా….ఇజ్రాయెల్‌పై దాడిలో సామాన్య పౌరులను చంపాలనే ఉద్దేశం తమకు లేదని చెప్పారు. అసలు అలాంటి ఆదేశాలను హమాస్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. అలా అయితే ఈ నెల 7వ తేదీన హమాస్ దాడిలో 1,400 మంది ఇజ్రాయెలీ పౌరులు ఎలా చనిపోయారని ప్రశ్నించగా.. సమాధానం చెప్పకుండా.. ‘‘ఇంటర్వ్యూ ఇక్కడితో ముగించాలనుకుంటున్నా’’ అని ఘాజా హమాద్ తప్పించుకున్నారు.