ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగ భద్రతకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో ముప్పు ఎదురయ్యే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఎండీ క్రిస్టలినా జార్జియేనా అన్నారు. కొన్ని ఉద్యోగాలైతే పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఉత్పాదకతను గణనీయంగా పెంచి ప్రపంచ వృద్ధికి ఏఐ దోహదపడుతుందని తెలిపారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ‘ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సుకు వెళ్లడానికి ముందు ఆదివారం రోజున క్రిస్టలినా ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపు 60 శాతం ఉద్యోగాలపై ఏఐ వల్ల ప్రతికూల ప్రభావం ఉంటుందని క్రిస్టలినా అన్నారు. నైపుణ్య ఆధారిత ఉద్యోగాలు అధికంగా ఉన్న రంగాలపై ఈ సాంకేతికత ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఏఐ వల్ల వచ్చే అవకాశాలను అందిపుచ్చుకునేలా పేద దేశాలకు మద్దతివ్వాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. 2024 చాలా కఠినమైన సంవత్సరంగా నిలవనుందున్న క్రిస్టలినా.. కొవిడ్-19 సమయంలో పేరుకుపోయిన అప్పులను వివిధ దేశాలు తీర్చాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.