తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొలిసారి మీడియాతో మాట్లాడారు. తన హత్యకు కుట్ర జరుగుతోందని తనకి ముందే తెలుసని చెప్పారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ ప్రస్తుత ప్రధానిపై ఇమ్రాన్ తీవ్ర ఆరోపణలు చేశారు.
లాహోర్‌లోని ఆస్పత్రిలో వీల్‌ఛైర్ మీద నుంచే ఆయన.. ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తనపై దాడి జరుగబోతున్నట్లు ఒక రోజు ముందే తెలిసిందని తెలిపారు. వజీరాబాద్ లేదా గుజ్రాత్‌లో హత్య జరిగేలా ప్రణాళికలు రచించినట్లు చెప్పారు.. హత్య కుట్ర వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇంటీరియర్ మంత్రి రానా సనావుల్లా, మేజర్ జనరల్ ఫైసల్ నసీర్ కలిసి తనపై హత్యకు కుట్రపన్నారని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు.
తన కాలికి నాలుగు బుల్లెట్లు తగిలాయని వెల్లడించిన ఇమ్రాన్.. పంజాబ్ గవర్నర్ సల్మాన్ తసీర్‌ను చంపినట్లే తన హత్యకు కుట్ర జరిగిందని అన్నారు. తాను సామాన్య ప్రజల నుంచి వచ్చానని.. తన పార్టీ మిలిటరీ స్థాపన కింద పని చేయదని స్పష్టం చేశారు. తన దగ్గర అతిముఖ్యమైన వీడియో ఒకటి ఉందనీ… తనకు ఏదైనా జరిగితే అది బయటకు విడుదల చేసేలా ఏర్పాట్లు చేశానని ఇమ్రాన్ అన్నారు.