పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు వరుస దెబ్బలు తగులుగుతున్నాయి. ఇప్పటికే అవినీతి, అధికార రహస్యాల వెల్లడి కేసుల్లో శిక్షపడి జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను కష్టాలు వీడట్లేదు. తాజాగా ఆయనకు మరో షాక్ తగిలింది. చట్టవిరుద్ధ వివాహ కేసులో ఏడేళ్లు జైలుశిక్ష పడింది. ఇస్లాం నిబంధనలకు విరుద్ధంగా ‘నిఖా’ చేసుకున్నారన్న అభియోగం మోపిన కేసులో ఇమ్రాన్ ఖాన్ (71), బుష్రా బీబీ (49) దంపతులకు పాక్‌లోని సీనియర్ సివిల్ జడ్జి కోర్టు శనివారం ఏడేళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల చొప్పున జరిమానా విధించింది.
వీరిద్దరిపై బుష్రా బీబీ మొదటి భర్త ఖవార్ ఫరీద్ మానెకా పెట్టిన ఈ కేసును రావల్పిండిలోని అదియాలా ట్రయల్ కోర్టు విచారించింది. పాకిస్థాన్‌లో ఈ నెల 8వ తేదీన సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఇటువంటి తరుణంలో ఇమ్రాన్‌కు వరుసగా జైలుశిక్షలు విధించటం ఆయన సారథ్యంలోని ‘పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్’ (పీటీఐ) పార్టీకి గట్టి ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.