ఇరాన్ దేశం రక్తిసిక్తంగా మారింది. వరుసగా జరిగిన రెండు బాంబు దాడుల్లో 103 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో 188 మంది గాయపడ్డారు. జనరల్ ఖాసీం సులేమానీ నాలుగో వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద జరిగిన కార్యక్రమంలో ఈ బాంబు పేలుళ్లు జరిగాయి. మొదటి పేలుడు జరిగిన 15 నిమిషాల తర్వాత రెండో పేలుడు చోటుచేసుకుంది.
ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించిన సమాచారం ప్రకారం.. జనరల్ ఖాసిమ్ సమాధి వద్దకు వందలాది మంది నడుచుకుంటూ వెళుతుండగా బాంబు పేలుళ్లు జరిగాయి. ఘటనా స్థలం కెర్మన్ ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు 820 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఉగ్రవాద దాడేనని కెర్మన్ డిప్యూటీ గవర్నర్ అన్నారు. ఇరాన్‌కు ప్రవాస గ్రూపులు, మిలిటెంట్ సంస్థలు, విదేశీ శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందని వివరించారు. మరోవైపు, ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఈ పేలుళ్లు జరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. గాజాపై దాడులను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.