ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించినట్లు ‘ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ’ ప్రకటించింది. ఈరోజు (మే 20వ తేదీ 2024) ఉదయం దాదాపు రెండు కిలోమీటర్ల దూరం నుంచి హెలికాప్టర్ ను కనిపెట్టినట్లు తెలిపింది. ఆ ప్రాంతంలో ఎవరూ బతికి ఉన్న ఆనవాళ్లు కనిపించడం లేదని ఇరాన్ అధికారులు పేర్కొన్నట్లు ఆ దేశ ప్రభుత్వ వార్తాసంస్థ ఐఆర్ఎన్‌ఏ వెల్లడించింది. ప్రమాదస్థలానికి సంబంధించిన కచ్చితమైన భౌగోళిక కోఆర్డినేట్‌లను మానవరహిత విమాన (UAV) గాలింపులో కనుగొన్నట్లు తెలిపింది.
‘తావిల్’ అనే ప్రాంతంలో హెలికాప్టర్ కూలి ఉండొచ్చని అనుమానించిన అధికారులు.. ఆ ప్రాంతానికి సహాయక బృందాలను పంపారు. మరోవైపు తుర్కియేకు చెందిన ‘అకింజి’ అనే యూఏవీ.. కాలుతున్నట్లుగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించింది. ఈ సమాచారాన్ని ‘ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్’ కమాండర్ సైతం ధ్రువీకరించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలిగినా.. రైసీ ఆచూకీ కోసం ప్రత్యేక దళాలు విశ్వప్రయత్నాలు చేశాయి.