గాజాలో దారుణ పరిస్థితులు.. పశువుల దాణాయే ఆహారం

-

గాజాపై ఇజ్రాయెల్ నిరంతర దాడులు నిర్వహిస్తోంది. ఇజ్రాయెల్ వరుస దాడులతో గాజా ప్రాంతంలో అత్యంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆహార కొరతతో పాలస్తీనా పౌరులు ఆకలితో అలమటిస్తున్నారు. ఆకలి చావు తప్పించుకోవడానికి గతంలో పశువులకు పెట్టిన దాణానే తినాల్సిన దుస్థితి నెలకొందని గాజా పౌరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు ఆహార కొరత, మరోవైపు ఆకాశాన్నంటిన ధరల కారణంగా గాజా వాసులకు తిండి దొరకడం కష్టంగా మారింది.

గాజాలోకి వస్తున్న సహాయ సామగ్రి బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఆహార నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. ధరలు ఆకాశాన్నంటాయి. యుద్ధం మొదలుకాక ముందు కిలో పిండి 8 షెకెళ్లు (రూ.181) ఉండగా ఇప్పుడు ఏకంగా 25 షెకెళ్లకు (రూ.570) చేరింది. ఆహార సరఫరాలు క్లిష్టమైన స్థాయికి క్షీణించడం వల్ల గాజా స్ట్రిప్ కరవు అంచున కొట్టుమిట్టాడుతోంది. ఆహారంలో ఇసుక కలిసిపోయి ఉన్నా కిమ్మనకుండా తినాల్సి వస్తోంది. పోషకాహార లోపంతో అనేకమంది పౌరులు ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆకలి చావులు చూడాల్సి వస్తుందని గాజా అధికారులు వాపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news