అమెరికాలో రాజకీయ హింసకు తావులేదని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తేల్చి చెప్పారు. షికాగోలో జరుగుతున్న డెమోక్రటిక్ పార్టీ జాతీయ కన్వెన్షన్‌లో మాట్లాడుతూ ఆయన ఇవాళ ఎమోషనల్ అయ్యారు. కుటుంబంతో సహా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బైడెన్ వేదికపైకి రాగానే ఆయన కుమార్తె యాష్లీ బైడెన్.. ‘నా తండ్రి ఆడపిల్లల పక్షపాతి. ఆయన మహిళలకు విలువనివ్వడం, నమ్మడం నేను చూశాను’ అని ఇంట్రడక్షన్ ఇస్తుండగా.. బైడెన్ ఒక్కసారిగా ఎమోషనల్ అయి కంటతడి పెట్టారు.
అనంతరం ప్రేక్షకులను ఉద్దేశించి ‘అమెరికా.. ఐ లవ్ యూ’ అని ప్రసంగం ప్రారంభించిన బైడెన్.. తమ దేశంలో రాజకీయ హింసకు తావులేదని.. ప్రజాస్వామ్యాన్ని కచ్చితంగా కాపాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అమెరికా ఆత్మను కాపాడే యుద్ధంలో ఉన్నామన్న ఆయన.. ఈ దేశంలో విద్వేషానికి చోటు లేదని స్పష్టం చేశారు. ట్రంప్ ఆధ్వర్యంలో ఏ నిర్మాణం జరగలేదన్న బైెడెన్.. మంచి మౌలిక వసతులు లేకుండా ప్రపంచంలో అత్యుత్తమ ఆర్థికవ్యవస్థగా ఎలా నిలవగలమని ప్రశ్నించారు.