బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో ఎగ్జిల్ పోల్స్ అంచనాల ప్రకారం లేబర్ పార్టీ గెలుపు దిశగా ముందుకు వెళ్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ప్రాథమిక ఫలితాల ప్రకారం లేబర్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీకి 410 సీట్లు, కన్సర్వేటివ్ పార్టీకి 131 సీట్లు వస్తాయమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఏ పార్టీ అయినా మెజారిటీ సాధించాలంటే 326 సీట్లు అవసరం ఉంటుందన్నది తెలిసిందే.
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ తొలి విజయాన్ని నమోదు చేసింది. సుందర్ల్యాండ్లో 18,847 ఓట్ల మెజారిటీతో లేబర్ పార్టీ గెలుపొందింది. కన్సర్వేటివ్ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారమే ఈ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ అన్నారు. బ్రిటన్ ప్రజలు మార్పు కోరుకున్నారని చెప్పారు. తమ పార్టీపై నమ్మకం ఉంచినందుకు ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు బ్రిటన్లో దాదాపు 4.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. ఈ సారి 2019తో పోలిస్తే తక్కువ పోలింగ్ నమోదైనట్లు అధికారులు అంచనా వేశారు. క్రితంసారి 67 శాతం పోలింగ్ నమోదైంది.