అరేబియా సముద్రంలో మరో నౌక హైజాక్‌కు గురైంది. సోమాలియా తీరంలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకున్న సమయంలో నౌకలో దాదాపు 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. లైబీరియా జెండాతో ఉన్న ‘ఎంవీ లీలా నార్‌ఫోల్క్’ హైజాక్ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే భారత నౌకాదళం స్పందించింది.
ఈ హైజాకింగ్ గురించి యూకే మారిటైమ్ ఏజెన్సీకి నౌక సందేశం పంపింది. గురువారం సాయంత్రం గుర్తుతెలియని సాయుధులు నౌకలోకి అక్రమంగా ప్రవేశించారని పేర్కొంది. వెంటనే స్పందించిన భారత నౌకాదళం హైజాక్‌కు గురైన భారతీయులతో కూడిన నౌక కోసం గాలింపు చర్యలు చేపట్టింది. భారతీయులను రక్షించేందుకు సముద్రతీర గస్తీ కోసం కేటాయించిన ఐఎన్‌ఎస్ చెన్నై యుద్ధనౌక బయలుదేరింది. దీంతోపాటు ఎయిర్‌క్రాఫ్ట్‌ను పంపింది. హైజాకైన నౌక కోసం నేవీ విమానం ద్వారా అన్వేషణ సాగిస్తోంది. హైజాకైన నౌకలోని భారతీయులతో విమాన సిబ్బంది సంభాషించినట్లు సమాచారం. ఆ నౌక గమనాన్ని సునిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం వారు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.