భారత్‌తో వివాదం మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకి దేశీయంగా ఉచ్చు బిగుస్తోంది. చైనాకు దగ్గరయ్యే క్రమంలో భారత్‌తో కయ్యానికి తెరతీసిన ఆయన వైఖరి పట్ల ఆ దేశంలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఆయన తీరుపై అక్కడి ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ వివాదం మాల్దీవుల అభివృద్ధికే చేటు చేస్తుందంటూ హెచ్చరిస్తున్నాయి. చైనాకు చెందిన పరిశోధక నౌకను మాల్దీవుల తీరంలో నిలపడానికి అనుమతించిన తరుణంలో ప్రతిపక్షాలు ఈ విధంగా హెచ్చరించినట్లు సమాచారం.
మాల్దీవుల అభివృద్ధిలో సుదీర్ఘ భాగస్వామ్యం ఉన్న మిత్రులను దూరం చేసుకోవడం దేశానికే హానికరం అంటూ ‘మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ’, ది డెమొక్రాట్స్ అక్కడి ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ ఇచ్చాయి. హిందూ మహా సముద్రంలో శాంతి, సుస్థిరత, మాల్దీవుల భద్రతకు చాలా కీలకమని ఈ సందర్భంగా ముయిజ్జు సర్కార్కు గుర్తు చేశాయి. ఎప్పటి నుంచో అనుసరిస్తున్నట్లుగా అన్ని అభివృద్ధి భాగస్వామ్య పక్షాలతో మాల్దీవులు కలిసి పని చేయాలంటూ మారుతున్న ‘విదేశాంగ విధాన వైఖరి’ని ఆ దేశ ప్రతిపక్షాలు ఎత్తిచూపాయి.