గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పునరావాస కేంద్రంగా ఉన్న ఓ పాఠశాల భవనంపై ఐడీఎఫ్ వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో 60 మందికిపైగా మృతి చెందారు. మరో 47 మంది తీవ్రంగా గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. సెంట్రల్ గాజా సిటీలోని తబీన్ పాఠశాలపై ఇవాళ (శనివారం) ఉదయం ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు.
గత వారంలో గాజాలోని మూడు పాఠశాలలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. మరోవైపు ఇటీవల ఓ పాఠశాలపై చేసిన దాడిలో 30 మంది మరణించారు. ఇక ఆగస్టు 1న చేసిన దాడిలో 15 మంది మృతి చెందారు. అక్టోబరు 7న హమాస్ ఉగ్రవాదుల మెరుపు దాడులకు ప్రతీకారంగా గత కొంతకాలంగా గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ యుద్ధంలో ఇప్పటివరకు గాజాలో 40,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.